Thursday, August 12, 2010

బస్సుల్లో కామాంధులు..

రవి చూపుడు వేలు సుతారం గా రాధ చేతిని మీటింది. తొలి పురుష స్పర్శ కి ఆమె ఉద్వేగం తో కంపించిపోయింది.. విసుగ్గా పుస్తకం విసిరేసాను ఒక పక్కకి. "ష్యూర్.. ఈ రాసే వాళ్ళకి బుద్ధీ జ్ఞానం లేదు.. అసలే లోకం లో ఉంటున్నారు వీళ్ళసలు? తొలి పురుష స్పర్శా? బీ యెస్స్సా? అంటే ఆ అమ్మాయి ఎక్కడ పెరిగింది? ఒక ఇసోలేటెడ్ చాంబర్ లోనా? ఎనిమిదో క్లాస్ లో వెనక బెంచీ పిల్లల దగ్గర్నించీ, ఆఫీస్ లో పక్క క్యూబ్ శ్రీనివాస్ (సారీ వికట కవి సీనూ! ) దాకా పొరపాట్న తగిలినట్టు చేయి తగిలించిన వాళ్ళే కదా.. అలాగని ఎదురు పడిన ప్రతి మనిషీ అలాంటి వారేనని కాదు కానీ.. మరీ ఈ విధం గా రాసేవాళ్ళు ఏమాలోచిస్తుంటారో.. చికాకేసింది. సిటీ బస్ హార్న్ కొట్టుకుంటూ వెళ్తోంది, కిటికీ అవతల. అసలు బస్సుల్లో ఎంత దుర్మార్గం.. మీద మీదకి పడటం, పైగా ఏమైనా అడిగితే..అంత కష్టం గా ఉంటే టాక్సీ లో వెళ్ళు ..బస్సులెందుకు ఎక్కుతావ్? అని అడగటం.. జెర్కిచ్చినా, బ్రేకేసినా.. మీద ఒరిగిపోవటం, తెలియనట్టు నటించటం.. కొంతమంది నడుం గిల్లటం, లేదా, ఎక్కడ పడితే అక్కడ చరచటం.. ఏమీ ఎరగనట్టు ఏటో చూడటం...నాకాశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. కాస్త రౌడీ లుక్ ఉన్నవాళ్ళే బెటర్..కనీసం ప్రిటెన్స్ ఉండదు.. కాకిగోల.. వెధా కామెంట్లు, వాడేదైనా కోతివేషమేస్తే.. గట్టిగా అన్నా చుట్టూ జనాలు నమ్ముతారు. మంచి గంభీరం గా కళ్ళజోడూ, ఇస్త్రీ బట్టలేసుకునే ఆసాములతో పెద్ద చిక్కే.. వాళ్ళని తిరిగి అడిగినా ఎవ్వరూ నమ్మరు భీ. కాలేజ్ టైం లో మా రూట్ లో ఒకతను, వయసు ఒక పాతికుంటాయేమో, రోజూ ఎవరో ఒక అమ్మాయిని టార్గెట్ చేసుకుని ఆ అమ్మాయి మాత్రమే చూసేలా జిప్ తీయటం.. ఒకమ్మాయి అయితే బిక్క చచ్చిపోయి.. చాలా రోజులు రికవర్ అవలేదు. పోనీ బస్సుల్లో ఇలా జరుగుతోందని చెప్తే ఇంట్లో వాళ్ళూ అంతే.. నువ్వేం చేస్తున్నావో.. తల వంచుకుని తిరిగితే.. వాడెందుకు నీవెనక పడతాడు? అందర్నీ వదిలేసి నీతోనే ఎందుకు మిస్బిహేవ్ చేస్తాడు? అని మా పైకే నెట్టటం.. అసలు మానేసేయ్ కాలేజ్ అన్నాడట ఒకమ్మాయి అన్నగారు.. ఎంత గొప్ప మనిషో.. . రోజూ ఎక్కేవాడు..ఒక్కసారి కూడా ఎవ్వరం వాడిని ఎదిరించలేదు. ఇప్పుడు అనిపిస్తుంది.. భయపడకుండా అందరూ (కనీసం 10-15 మంది ఉండేవాళ్ళం) బస్సులోంచి లాగి చెప్పుదెబ్బలేస్తే సరిపోయేదేమో..వాడేమీ పెద్ద గాంగ్ ని తెచ్చి గొడవపెట్టుకునే రకం లా అనిపించలేదు.. ఆరోజుల్లో ఎందుకంత ధైర్యం లేదో.. ఎవరికీ చెప్పుకోలేక, వాడిని పట్టుకుని వాయించలేక ఎంత చిత్రవధ అనుభవించామో ఆరోజుల్లో. ఒకసారి తెల్లటి సల్వార్ కమీజ్ వేసుకుని వస్తుంటే.. ఎవరో కావాలని ఆ రష్ లో తొక్కిడి లో పాన్ నమిలి ఉమ్మేసాడు వెనక. ఏంటా అనుకున్నా.. అంత రష్ లో తెలియలేదు ఇంటి కొచ్చాక చూసుకుంటే ఎంత బాధనిపించిందో..

ఆ రూటూ, కాలేజీ వదిలేసి డికేడ్ దాటిపోయింది. మొన్న ఒక లెక్చరర్ రిటైర్ అవుతున్నారని పూర్వ విద్యార్థులందర్నీ పిలిస్తే..వెళ్ళాం. ఆ రోజుల గురించి మాట్లాడుతూ వాడి గురించి ఎత్తాను. చాలా మంది సైలెంట్.. మాటల్లో తేలిందేంటంటే అందరూ ఆ కష్టం అనుభవించారట ఎప్పుడో ఒకసారి. మళ్ళీ అప్పుడే జరిగినట్టు గా అనిపించి భగ్గుమని మండింది. ఏం చేస్తాం? కాలం వెనక్కి రాదు కదా? బాధనిపించింది.

Friday, August 6, 2010

శరతేనా? అసలు రాసేది ఆడా? మగా? తెలిసిన బ్లాగరేనా?

శరత్ బ్లాగ్ చూడకముందు సీతా కాలం అని సరదాగా బ్లాగ్ క్రియేట్ చేసినా శరత్ కాలం చూశాక వద్దులే కాపీలా ఉంటుంది అని నేను అక్కడికే వదిలేశాను. తర్వాత అన్ని బ్లాగ్స్ చదువుతూ, అవగాహన పెంపొందించుకుందామని చూస్తూ ఉన్నాను. అప్పుడే అనాన్ ల కామెంట్స్, స్వభావం, అర్థం చేసుకుంటూ వస్తున్నాను. కామెంట్ మాడరేషన్ ఎనేబుల్ చేసుకుని తీరాలని అర్థమయ్యింది. యాధృచ్చికం గా ఆయన బ్లాగ్ లో ఆడ బ్లాగర్ల గురించి రాసిన వ్యాసం నన్ను ఆకర్షించింది. అవును.. అసభ్యం, అశ్లీలం కానంతవరకూ ఒక బ్లాగ్ లో ఎందుకు ఇంకొన్ని నిజాలు మనం రాసుకోకూడదు? విషయం ప్రధానం. కానీ ఎవరు రాశారు? వాళ్ళని వ్యక్తిగతం గా అటాక్ చేద్దాం అనే అనాన్ ల కామెంట్లు ప్రచురించను. కానీ మిగిలిన కామెంట్లు ప్రచురిస్తాను. అలాగే ఈ బ్లాగ్ లో ఏదో ఏ టాగ్ ఉన్న విషయాలుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశే. ఎవరు నమ్మినా నమ్మకున్నా నా పేరు సీత. నేను భారత స్త్రీనే.




రేపటి పోస్ట్ లో : బస్సుల్లో కామాంధులు.

Thursday, August 5, 2010

వృద్ధనారీ పతివ్రతా..

స్కూల్లో పక్క బెంచ్ లో కూర్చునేది శ్రీవిద్య. మా టౌన్లో ఉన్న స్కూళ్ళన్నింటిలో మాదే మంచి స్కూలని పేరు. 9 వ తరగతి లో స్కూల్ కి 10 రోజులు రాలేదు. తర్వాత వచ్చాక క్లాస్ లో పిల్లలంతా విద్యా విద్యా అంటూ వెనకే.. చాలా ఎంజాయ్ చేసేది. మేమంతా గొంగళీ పురుగుల్లా..అదొక్కత్తే శీతాకోకచిలక లా.. పదో క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి మాతో ఇంటికి నడుస్తూ రావటం మానేసింది. కొత్త పరిచయాలు.. మందలిద్దామంటే మాకూ భయం/క్యూరియాసిటీ. శ్రీనివాస్ అన్న అబ్బాయితో తిరిగేది. పరిచయం ఎంత వరకూ .వెళ్ళిందో తెలియదు.మాతో మాటలు తగ్గించేసింది. మాకేమో దాన్ని చూస్తే హీరో వర్షిప్! తర్వాత ఇంటర్ లో ఎంసెట్ కోచింగ్ అని నేను బిజీ. ఇంటర్ లో ఒకసారి రాత్రి వస్తుంటే కార్నర్ లో చెట్టు పక్క గుస గుస.. నేను నిలబడిపోయి.. ఎవరో చూద్దాం అని..నెమ్మదిగా చూస్తే.. అదే విద్య. పక్కనున్నది శ్రీనివాస్ కాదు. నన్ను చూసి వాడెళ్ళిపోయాడు. ఇది బట్టలు సద్దుకుంటూ వచ్చింది. నాకు చాలా ఎక్జైట్మెంట్.. ఏం చేస్తున్నారు? అని అడిగితే ఏమీలేదు.. పద అంది. శ్రీనివాస్ ఏమయ్యాడు? అంటే.. వాడి గొడవ ఎందుకు? అంది. ఎవ్వరికీ చెప్పకు వాడు నన్ను ప్రేమిస్తున్నాదు. పేరు వెంకట్ . అంది. ఏం చేస్తాడు? అంటే బీ కాం ఫస్ట్ అంది. తర్వాత చాలా రోజులు కనపడలేదు. ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ రాంక్ వచ్చాక వేరే ఊళ్ళో హాస్టెల్ లో చదవాలి.. స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసాం. విడిపోతుంటే.. చంద్రశేఖర్ ట దీని కొత్త "ఫ్రెండ్" మోటర్ సైకిల్ మీద వచ్చాడు.. వార్నీ అనుకున్నాం. ఇంజనీరింగ్ అయ్యాక.. విశ్వనాథ్ తో కనిపించింది ఒక హోటల్లో.. మా అమ్మావాళ్ళకి కూడా పరిచయం చేసింది. నా వుడ్ బీ అని. తర్వాత ఎవరిద్వారానో విన్నాను దాని పెళ్ళయిందని. లాస్ట్ ఇయర్ మా హైదరాబాద్ లో కనపడింది. ముందు గుర్తుపట్టలేదు. బొద్దుగా, మాంగో యెల్లో చీర, బొట్టూ, గాజులూ, చాలా బాగుంది. సాఇ బాబా గుడి కెళ్ళివస్తున్నా అంది. ఇల్లు దగ్గరే రా అని పిలిచింది. వాళ్ళాయన ని పరిచయం చేసింది. 'ఈయన పేరు.. అని.. ' నేం ప్లేట్ చూపించింది. వాళ్ళత్తగారు కల్పించుకుని చెప్పారు. మురిపెం గా కోడల్ని చూస్తూ.. మా ఇళ్ళళ్ళో మేం వదిలేసాం కానీ.. విద్య మాత్రం ఇంకా పాటిస్తోంది.. భర్త పేరు ఎత్తదు.. వాడి పేరు ప్రసాద్.. అని..
దాని మొహం లో ఎక్కడా..మర్యాదా, అణకువా,భక్తీ తప్ప వేరే భావమేమీ లేశమాత్రమైనా కనిపించలేదు.. . అసలే పతివ్రతాయె..

Wednesday, August 4, 2010

బాగ్లోకం లో మొదటి అడుగు..

నా పేరు సీత! సగటు మనిషిని. స్త్రీ ని. ఒక సగటు భారత స్త్రీ కున్న కష్ట నష్టాలు, బాధలూ, బరువులూ, మర్యాదా, మన్ననా, అన్నీ స్వయానా/లేక ఇతరుల ద్వారా అనుభవించిన దాన్ని.

భారత నారి వ్యక్తిత్వానికి ప్రతీకని అని నేననను. ఒక మామూలు మనిషిని, ఆడదాన్ని, ఒకరికి కూతుర్ని, ఒకరికి భార్యని, ఒకరికి ఇల్లాలిని, ముగ్గురు బిడ్డల తల్లిని, అక్కని, మరదల్ని, చెల్ల్లిని, వదినని, ఒక చిన్న ఆఫీస్ లో ఇంజనీర్ ని, ఒక ఎన్ జీ ఓ లో వాలంటీర్ ని.
తెలుగు లో బ్లాగు రాద్దామని అనుకుని సీతాకాలం అని పేరు పెట్టుకుని మెయిల్ ఐడీ అయితే క్రియేట్ చేశా కానీ, శరత్ కాలం అన్న బ్లాగ్ చూశాక కాపీ అనుకుంటారని కాస్త వెనుకంజ వేశా. నిన్న శరత్ కాలం లో ఆడ బ్లాగర్ల గురించి చదివాక, సరే ఎలాగూ అనుకుంటే అనుకుంటారని ఆయన టెంప్లేట్ కాపీ చేసా. ఆయన స్లోగన్ కూడా.
నాలుగు రోజులు పోయాక నా టెంప్లేట్, స్లోగన్ మారుస్తా. కాస్త బ్లాగ్ టెక్నాలజీ అర్థం కావాలి. అలాగే మా ఆఫీస్ లో ఇంటర్నెట్ ఉండదు. కాబట్టి నెమ్మది రోజూ ఒక అరగంట మాత్రమే బ్లాగ్లోకం లో విహరించటానికి నాకు టైం. అందులోనే.. బ్లాగులు చదవటం, రాయటం, ఏది జరిగినా!
సీత.